ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాఁబడు. దేవదత్తుని చేత వంటకము వండఁబడియె. వండఁబడియె ననఁగా వంట చేయఁబడియెనని యర్థము. చేయుటం కాశ్రయుఁడగుటం జేసి దేవదత్తుండు కర్తయయ్యె.
4. చేతవర్ణకంబు హేతుకరణంబులకు, గ్రహ్యాదియోగజంబగు పంచమికిని బహుళంబుగా నగు.
ఫలసాధనయోగ్యం బగు పదార్థంబు హేతువు. క్రియాసిద్ధిం బ్రకృష్టోపకారంబు కరణంబు. హేతువునకు: ధనముచేత సౌఖ్యంబు గలుగు. విద్యచేత యశంబు గలుగు. పక్షంబున వలన వర్ణకంబగు. కరణంబునకు: ఖడ్గంబుచేత ఖండించె, కోలచేతఁ గూలనేసె. పక్షంబున దోడవర్ణకంబగు. గ్రహ్యాది యోగంబునందు: జరాసంధుఁడు రాజులచేతఁ గప్పంబు గొనియె. మైత్రుండు చైత్రునిచేత ఋణంబు గొనియె. ఈ యర్థంబులు నీచేత నెఱింగితి. ఈ వృత్తాంతంబు వానిచేత వింటి. పక్షంబున వలన వర్ణకంబగు. ఇత్యాదికంబు లెఱుంగునది.
5. కరణ సహార్థ తుల్యార్థయోగంబులం దృతీయకుం దోడవర్ణకం బగు.
కరణంబునందు: కోలతోడఁగూలనేసె. సహార్థంబునందు: రాజు సేనలతోడ వచ్చె - సేనాసహితుండయి వచ్చెనని యర్థము. తుల్యార్థ యోగంబునందు: చైత్రుని తోడ మైత్రుండు తుల్యుండు. తృతీయకనుటంజేసి చైత్రునకు మైత్రుండు తుల్యుండని తుల్యార్థయోగంబున షష్ఠియునగు.
6. వచ్యర్థాముఖ్యకర్మంబునకుఁ దోడఁ కువర్ణకంబులు ప్రాయికంబుగా నగు.
మైత్రుండు చైత్రుని తోడ నిట్లనియె - మైత్రుండు చైత్రున కిట్లనియె. ప్రాయికం బనుటచే వొకానొకచో ద్వితీయయునగు.
7. ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవర్ణకం బగు.
నియమపూర్వక విద్యాస్వీకారం బుపయోగం బనంబడు. రామకృష్ణులు సాందీపునితోడ వేదంబుల జదివిరి - సాందీపునివలన నని యర్థము.
0 వ్యాఖ్యలు:
Post a Comment