28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు.
కఱకు ... అమ్ము ... కఱకుటమ్ము
నిగ్గు ... అద్దము ... నిగ్గుటద్దము
సరసపు ... అలుక ... సరసపుటలుక
29. కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.
పేరు ... ఉరము ... పేరటురము, పేరురము చిగురు ... ఆకు ... చిగురుటాకు, చిగురాకు
పొదరు ... ఇల్లు ... పొదరుటిల్లు, పొదరిల్లు
30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు.
పేద ... ఆలు ... పేదరాలు
బీద ... ఆలు ... బీదరాలు
పేద - బీద - ముద్ద - బాలింత - కొమ్మ - జవ - అయిదవ - మనుమ - గొడ్డు ఇట్టివి పేదాదులు. ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది. "ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము.
31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు.
ధీర ... ఆలు ... ధీరురాలు
గుణవంత ... ఆలు ... గుణవంతురాలు
ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము.
32. కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు. సరసము ... మాట ... సరసపుమాట, సరసంపుమాట
విరసము ... వచనము ... విరసపువచనము, విరసంపువచనము
0 వ్యాఖ్యలు:
Post a Comment