2. | సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు.సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు. అందు సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు.
కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు. రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు.
సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు. రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు.
తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు. ఱేని యానతి - చెఱువు నీరు - సిరి చెలువుఁడు.
ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు. రాజు ముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు.
3. | తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు.తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు. అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు వ్యధికరణంబని సమానాధికరణంబని ద్వివిధంబు.
ద్వితీయాదులకు మీఁది పదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు. నెలతాల్పు - నెల తక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రాముని బాణము - మాటనేర్పరి.
విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు. ఇదియె కర్మధారయంబు నాఁబడు. సరసపు వచనము - తెల్ల గుఱ్ఱము - మంచిరాజు.
ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు. ముజ్జగములు - ముల్లోకములు.
బాహువ్రీహి ముక్కంటి - చలివెలుఁగు.
ద్వంద్వము తల్లిదండ్రులు - అన్నదమ్ములు.
ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు.
ముఖపద్మము - చరణకమలములు. ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.
సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు. రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు.
కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు. దానంజేసి యనేకమాఱు లల్పదండిత్యాదులు దుష్టములని తెలియునది. |
| |
|
|
|
0 వ్యాఖ్యలు:
Post a Comment