18. కలన్వాదుల నువర్ణంబు కుఙ్ఙగు; బహువచనము పరంబగునపుడు నిత్యముగా నగు.
కలఁకు - కలను - కలఁకులు - కలను - కెలను - కొఱకు - కొలను - గవను - నెఱను - మ్రాను - వరను - వలను. ఇవి కలన్వాదులు.
19. అట్లు రేను గోను శబ్దముల నువర్ణంబు గుఙ్ఙగు.
రేఁగు - రేను - రేఁగులు, గోఁగు - గోను - గోఁగులు.
20. బహువచనంబు పరంబగునపుడు చేను పేను మీను శబ్దంబుల నువర్ణంబు లోపించు.
చేను - చేలు, పేను - పేలు, మీను - మీలు. 21. బహువచనంబు పరంబగునపుడు రేయి ప్రభృతుల తుది యక్షరంబు లోపించు.
రేయి - రేలు, ఱాయి - ఱాలు, వేయి - వ్రేలు, వ్రాయి - వ్రాలు ఇత్యాదులు. ఈ లోపంబు సమాసంబులందుం జూపట్టెడు. రేరాజు - మగఱాపతకము - వేవెలుఁగు.
22. బహువచనంబు పరంబగునపు డావు ప్రభృతుల తుదియక్షరంబునకు లోపంబు విభాష నగు.
ఆవు - ఆలు - ఆవులు, జాము - జాలు - జాములు, చుట్టము - చుట్టలు - చుట్టములు, మీసము - మీసలు - మీసములు.
23. ఇ య కు మాఱుగా నామాంతంబున కెత్వంబు బహుళంబుగా నగు.
కన్నియ - కెన్నె, జన్నియ - జన్నె, వన్నియ - వన్నె, కొంచియము - కొంచెము, కొండియము - కొండెము.
బహుళ గ్రహణముచే సందియము కాఱియ మొదలగు శబ్దంబులందెత్వములేదు. ఇయశబ్దంబునం దికారలోపంబు కొందఱు వక్కాణించిరి. అయ్యది ప్రయోగంబులందు మృగ్యంబు. ముత్తియ శబ్దంబునందు మాత్ర మిత్వలోపంబు గానంబడియెడి. ముత్తియము - ముత్తెము - ముత్యము.
0 వ్యాఖ్యలు:
Post a Comment