1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు.
పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి యనఁబడు.
రాముఁడు ... అతఁడు ... రాముఁడతఁడు.
సోముఁడు ... ఇతఁడు ... సోముఁడితఁడు.
మనము ... ఉంటిమి ... మనముంటిమి.
అతఁడు ... ఎక్కడ ... అతఁడెక్కడ.
ఇతఁడు ... ఒకఁడు ...ఇతఁడొకఁడు.
2. ప్రధమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబు లందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును.
నన్ను + అడిగె = నన్నడగె, నన్నునడిగె.
నాకొఱకున్ + ఇచ్చె = నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె. నాకున్ ... ఆదరువు ... నాకాదరువు, నాకునాదరువు.
నాయందున్ ... ఆశ ... నాయందాశ, నాయందునాశ.
ఇందున్ ... ఉన్నాఁడు ... ఇందున్నాఁడు, ఇందునున్నాఁడు.
ఎందున్ ... ఉంటివి ... ఎందుంటివి, ఎందునుంటివి.
వచ్చుచున్ ... ఉండెను ... వచ్చుచుండెను, వచ్చుచునుండెను.
చూచుచున్ ... ఏగును ... చూచుచేగెను, చూచుచునేగెను.
3. సంధి లేని చోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు. ఆగమం బనఁగా వర్ణాధిక్యంబు.
మా ... అమ్మ ... మాయమ్మ.
మీ ... ఇల్లు ... మీయిల్లు.
మా ... ఊరు ... మాయూరు.
4. అత్తునకు సంధి బహుళముగా నగు.
మేన ... అల్లుడు ... మేనల్లుడు, మేనయల్లుడు.
పుట్టిన ... ఇల్లు ... పుట్టినిల్లు, పుట్టినయిల్లు. చూడక ... ఉండెను ... చూడకుండెను, చూడకయుండెను.
బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధిలేదు.
అమ్మ ... ఇచ్చెను ... అమ్మయిచ్చెను.
దూత ... అతఁడు ... దూతయితఁడు.
చెలువుఁడ ... ఇందము ... చెలువుఁడయిందము.
సంస్కృతీయంబునకు సంధి యగునని యధర్వణాచార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందుఁ బ్రయోగంబు మృగ్యంబు. ఆధునిక కృతులం దొకానొకచోట స్త్రీవాచక తత్సమంబులకు సంధి గానం బడియెడు. గంగనుకాసె - నెలఁతిచ్చెను. వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనే యని యూహించునది.
0 వ్యాఖ్యలు:
Post a Comment